బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ‘పైకి సిగపట్లు, లోపల చప్పట్లు’ ఇదే ఆ రెండు పార్టీల మధ్య సాగుతున్న దొంగ రాజకీయమని దుయ్యబట్టారు. రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో ‘బీజేపీ రాష్ట్ర సమితి’గా రాజకీయాన్ని చేస్తున్నాయని దుయ్యబట్టారు.
తాజాగా.. వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీఆర్‌ఎస్, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు వేర్వేరు కాదని.. రెండు పార్టీలో ఒకటేనని అన్నారు. రెండు పార్టీలు కలిసి ‘బీజేపీ రాష్ట్ర సమితి’ రాజకీయాన్ని నడుపుతున్నాయన్నారు. అందుకే కేసీఆర్ అవినీతి చేశారని తెలిసినా.. కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు.
ఢల్లీి దాకా కేసీఆర్ అవినీతి పాకిందని చెబుతున్న బీజేపీకి.. కేంద్రంలో అధికారం పెట్టుకొని ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? మోడీ గారు.. కేసీఅర్ అవినీతిపై మీ దగ్గర ఇంత సమాచారం ఉంటే… ఇన్నాళ్లు ఎందుకు విచారణ జరిపించలేదు? కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు ? కేసీఆర్‌ది అత్యంత అవినీతి ప్రభుత్వమే అయితే తక్షణ దర్యాప్తునకు ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు ? మాయల ఫకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్లు కేసీఆర్ అవినీతి చిట్టా మీ దగ్గరుంది. మీకు నచ్చినట్లు కేసీఆర్‌ను ఆడిస్తుంటే, మీరు చెప్పినట్లు కేసీఆర్ ఆడుతున్నాడు. కాళేశ్వరం అవినీతిపై సాక్ష్యాధారాలు మీ చేతుల్లో పెట్టుకొని యాక్షన్ తీసుకోకపోవడం మీ రహస్య బంధానికి ప్రతీక అని షర్మిల అన్నారు.









