ఏపీలో మహిళల మిస్సింగ్, వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏలూరులో మహిళల మిస్సింగ్‌పై పవన్ చేసిన ఆరోపణలపై ఆధారాలివ్వాలని స్పష్టం చేసింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మహిళల భద్రతకు భంగం కలిగేలా ఉన్నాయని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మహిళలు కనిపించకుండా పోతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారాహి యాత్రలో భాగంగా పవన్ మాట్లాడుతూ.. మహిళలను కిడ్నాప్ చేసేందుకు వైసిపి నాయకులు వాలంటీర్ల వ్యవస్థను వాడుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎపి మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్‌కు నోటీసులు పంపింది.
వాలంటీర్లపై వ్యాఖ్యలకు పవన్ సమాధానం చెప్పాలని, లేదా క్షమాపణలు అయినా అడగాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. లేకపోతే.. మహిళా కమిషన్ వెంటాడుతూనే ఉంటుందని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. మరోవైపు, పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల దగ్గర వాలంటీర్ల ధర్నాలు చేపట్టి, పవన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.









