AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వీడు మామూలోడు కాదు.. నిత్యపెళ్లి కొడుకు చేతిలో మోసపోయిన 15 మంది అమ్మాయిలు

పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఒకరు ఇద్దరు కాదు ఏకంగా పదిహేను మందికిపైగా మహిళలను మోసం చేసిన మహేశ్ కేబీ నాయక్ (35) అనే వ్యక్తిని కర్ణాటక పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బెంగళూరులోని బనశంకరికి చెందిన నిందితుడి నుంచి రూ.2 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు మొబైల్ ఫోన్లు, బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మైసూరుకు చెందిన హేమలత (30) అనే యువతిని షాదీ డాట్ కామ్‌లో నిందితుడు తాను డాక్టర్‌ను అని పరిచయం చేసుకున్నాడు.

విజయనగరలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, అది తన సొంత ఇల్లు అని నమ్మించాడు. ఇది నిజమేనని భావించిన బాధితురాలు.. అతడితో పెళ్లికి అంగీకరించింది. దీంతో ఈ ఏడాది జనవరి 1న విశాఖపట్నం వెళ్లి వివాహం చేసుకున్నారు. అక్కడ నుంచి మైసూరుకు వచ్చి కాపురం పెట్టారు. కొద్ది రోజుల తర్వాత క్లినిక్‌ పెట్టాలని, అందుకు రూ.70 లక్షల ఖర్చువుతుందని చెప్పి.. ఆ మొత్తం సమకూర్చమని హేమలతను కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో చంపుతానని బెదిరించాడు.

ఈ క్రమంలో వీలు చూసుకుని బీరువాలో ఉన్న రూ.15 లక్షల విలువైన ఆభరణాలు తస్కరించి పరారయ్యాడు. ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగొస్తాడని భావించిన హేమలత.. కొద్ది రోజులు ఎదురుచూసింది. ఇదే సమయంలో అతడి చేతుల్లో మోసపోయిన దివ్య అనే మహిళ అనుకోకుండా కలిసింది. మహేశ్‌ తనను కూడా పెళ్లి చేసుకుని మోసం చేశాడని దివ్య చెప్పడంతో హేమలత షాకయ్యింది. చివరకు కువెంపునగర పోలీస్ స్టేషన్‌లో ఇద్దరూ ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. విచారణలో అతడు 15 మందికిపైగా మహిళలను ఇలాగే వంచించినట్టు తెలిసి పోలీసులే విస్తుపోయారు. కొందరిని వివాహం చేసుకుని, మరికొందరితో నిశ్చితార్థం పూర్తయిన తర్వాత నగదు, నగలతో ఉడాయించేవాడని గుర్తించారు. మోసపోయిన బాధితుల్లో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు, ఆర్ధికంగా స్వతంత్రులే ఉండటం గమనార్హం. కొందర్ని పెళ్లి చేసుకోగా.. వారికి నలుగురు పిల్లలు కూడా ఉన్నట్టు తెలిసింది.

ANN TOP 10