కేటీఆర్ ట్వీట్‌పై మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ విమర్శలు గుప్పించారు. ‘మీ ఒక్క అమ్మమ్మ మాత్రమే సంతోష పడాలా ? మిగతా 26000 అమ్మమ్మల సంగతేంటి అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్ల తర్వాత మన ఊరు మనబడి అంటివి. రూ.7,268 కోట్లు అంటివి. ఇప్పటివరకు 430 కోట్లే (6%) మాత్రమే ఖర్చు చేశారని మండి పడ్డారు. 26,000 ప్రభుత్వ బడులల్లో కూడా ఇలాంటి భవనాలు కడితే మెచ్చుకుంటాం. అని ఆయన ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. కామారెడ్డి జిల్లాలోని కేటీఆర్ నానమ్మ ఊరు కోనాపూర్‌లో మంత్రి కేటీఆర్ అత్యాధునిక హంగులతో ప్రభుత్వ స్కూల్‌ను నిర్మించారు. ఈ ఏడాది ప్రారంభంలో కోనాపూర్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్.. ఊరంతా కలియదిరుగుతూ గ్రామస్తులతో ముచ్చటించారు. తర్వాత కోనాపూర్‌లో ‘నా ఊరు – నా పాఠశాల’ కింద తన సొంత డబ్బు రూ.2.5 కోట్ల వెచ్చించి నానమ్మ వెంకమమ్మ పేరుతో కట్టిస్తున్న స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. తాజాగా.. స్కూల్ నిర్మాణం పూర్తి చేసుకోగా.. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి నియోజకవర్గం కోనాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేశాం. మా నానమ్మ వెంకటమ్మ గారు తప్పకుండా సంతోషిస్తారు. త్వరలో ప్రారంభోత్సవం చేయబోతున్నాం.‘ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై మాజీ ఐఏఎస్ పై విధంగా స్పందించారు.









