
కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు
కంది క్యాంపు కార్యాలయంలో నిత్యం సందడే సందడి
ఆదిలాబాద్: పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల రాకతో నిత్యం సందడిగా మారుతోంది. పలువురు ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు నచ్చి ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నారు. పట్టణంలోని శాంతినగర్, ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని దహిగూడ, బేల మండలంలోని దహెగాం గ్రామాల నుంచి తరలివచ్చిన యువకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు.
మనందరి లక్ష్యం ఇక్కడి కుటుంబ రాక్షస పాలన అంతం చేయడమేనని ఆయన అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలన్నీ కబ్జాలు చేయటమే ఎమ్మెల్యే జోగు కుటుంబీకుల ఏకైక లక్ష్యంగా అధికారంలో కొనసాగుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలను మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటికపుడు దరఖాస్తుదారులకు రేషన్ కార్డులు అందేవని, ఇప్పుడు ఏళ్లుగా ఎదురుచూపులు తప్పడంలేదని అన్నారు. జోగు రామన్నడబ్బును నమ్ముకొని రాజకీయాలు చేస్తే తాను జనాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కార్యక్రమంలో గిమ్మ సంతోష్ రావు, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ ఎంఎం. షకీల్, సంజయ్ రెడ్డి , నాగార్కర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.










