
పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి
కంది సమక్షంలో భారీ చేరికలు
ఆదిలాబాద్: రాష్ట్రంలోని రాక్షస పాలన అంతం చేయడం ఏకైక లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. పట్టణంలోని టీఎన్‌జీవో భవన్‌లో శనివారం కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరారు. వారందరికీ కంది శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కంది శ్రీనన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగురామన్న అవినీతికి అంతం లేకుండా పోయిందన్నారు. ప్రభత్వ, ప్రైవేటు స్థలాలన్నీ కబ్జాలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధిని విస్మరించి, ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జోగురామన్నకు బుద్ధి చెప్పాల్సిందేనని కంది శ్రీనివాసరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

గత కాంగ్రెస్ పాలనలో ఎప్పటికప్పుడు దరఖాస్తుదారులకు రేషన్‌కార్డులు అందేవన్నారు. ఇప్పుడు ఏళ్లుగా ఎదురుచూడాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క నియోజకవర్గంలోనే పాతికవేలకు పైగా కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చాయన్నారు. పింఛన్లు, ఇంటి స్థలాలు, రుణాలు, రేషన్‌కార్డులు, స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ .. ఇలా ప్రతీ పథకం కోసం నిరీక్షించాల్సి దుస్థితి నెలకొందన్నారు. జోగురామన్న కుటుంబం రూ.5వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు వారి అనుచరగణమే చెబుతోందన్నారు.
ఓట్లేసిన ప్రజలను మోసం చేయడమేతప్ప ఇప్పటి వరకు ఒరగబెట్టేందేమీలేదన్నారు. జోగురామన్న ధన బలాన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని, నేను జనబలాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. నాకు అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో ఉన్న పరిచయాలు, మిత్రుల సహకారంతో ఆదిలాబాద్ లో ఏదైనా ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసి సుమారు 10వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. సమావేశం ముగిసిన అనంతరం నాయకులు, కార్యకర్తలు కంది శ్రీనన్నను భుజాలపైకెత్తుకుని నృత్యాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటారు.









