బీజేపీ అధిష్టానం అసంతృప్తులను బుజ్జగిస్తోంది. పదవులను ఎరగా చూపి పార్టీ బంధం వేస్తోంది. మొన్నటి వరకు ఈటల రాజేందర్ పార్టీని వీడేందుకు రెడీ అయ్యారు అనుకున్న సమయంలో పక్కగా ఆయనను పదిల పరుచుకునేందుకు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవిని అప్పగించారు. దీంతో ఈటల తన వ్యూహాలకు ఫుల్ స్టాప్ పెట్టక తప్పలేదు.
ఇప్పుడు తాజాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా బీజేపీ పెద్దలు బంధం వేశారు. ఆయన కొన్నాళ్లుగా మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతారంటూ.. ప్రచారం జరిగింది. దీనికి దన్నుగా.. ఆయన బుధవారం.. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారు.
అయిందేదో అయిపోయింది.. అన్నట్టుగా మాట్లాడారు. ఇక పార్టీ పెద్దలతో చర్చించడమే తరువాయి.. తాను కండువా మార్చుకుంటానని రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు కూడా ప్రచారంలోకి వచ్చింది. అంతే.. ఇంతలోనే కేంద్రంలోని పెద్దల నుంచి ఉత్తర్వు వచ్చేసింది. ‘పార్టీ నాయకుడు మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తున్నాం. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుంది’ అని పేర్కొన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నియామకం చేసినట్టు తెలిపారు. అయితే.. ఈ నియామకం వెనుక పక్కాగా.. రాజగోపాల్‌రెడ్డిని ఎటూ కదలకుండా చేయడమే వ్యూహంగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరి దీనిపై కోమటిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.









