హైదరాబాద్ బాలాపూర్‌లో దారుణం
ఓ సమోసా ఆర్డర్ చేసినందుకు ఓ యువకుడి పైన ఆ హోటల్ సిబ్బంది విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్‌లోని ఓ హోటల్లో జరిగింది. మహమ్మద్ ఫిరోజ్ అనే యువకుడు.. సరదాగా ఓ హోటల్‌కి వెళ్లాడు. ఎప్పటిలాగే సమోస ఆర్డర్ చేశాడు. దీంతో.. ఏం జరిగిందో తెలియదు.. హోటల్ సిబ్బంది వచ్చి తనతో గొడవకు దిగారు. దీంతో.. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారి.. ఫిరోజ్‌ను ఒక్కడిని చేసి విచక్షణారహితంగా దాడి చేశారు.
ఈ దాడిలో ఫిరోజ్‌కు తీవ్రంగా గాయాలై రక్తం కూడా రావటం గమనార్హం. దీంతో.. స్థానికులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఫిరోజ్.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హోటల్ సిబ్బంది.. అకారణంగానే తనపై దాడికి తెగబడ్డారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అసలు గొడవకు కారణాలేంటీ.. ఎందుకు కొట్టారు.. ఎవరిది తప్పు.. అన్న కోణాల్లో విచారిస్తున్నారు. హోటల్లో ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు చెక్ చేస్తున్నారు.









