AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

రాష్ట్రంలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణలో మరో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించిందని ఆరోగ్యశాఖమంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విద్య విప్లవానికి నాంది అంటూ ట్వీట్ చేశారు. జోగులాంబ గద్వాల్, నారాయణ్‌పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నట్లు చెప్పారు మంత్రి హరీష్‌రావు. కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు మంత్రి. తద్వారా రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 10వేలకు చేరుకుంటాయన్నారు. ప్రతి జిల్లాలకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయన్నారు.

స్వరాష్ట్రంలోనే ఎంబీబీఎస్ చదివేందుకు యువతకు అవకాశాలు పెరుగుతాయని చెప్పారు మంత్రి హరీష్‌రావు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, అవి అందుబాటులోకి కూడా వచ్చాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాల‌నే ఉద్దేశంతో.. ప్రతి జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు.

ANN TOP 10