AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహబుబాబాద్ జిల్లాలో వెరైటీ చోరీ.. టమాటాలు, పచ్చిమిర్చి దొంగతనం

కూరగాయల ధరల విపరీతంగా పెరిగిన నేపథ్యంలో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కూరగాయల మార్కెట్‌లో దొంగలు కూరగాయలను దొంగిలిస్తున్నారు. ఇటువంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో చోటు చేసుకుంది.

గాంధీ సెంటర్‌లోని కూరగాయల మార్కెట్‌లోని ఓ కూరగాయల వ్యాపారి దుకాణం నుంచి టమాట, పచ్చిమిర్చి, చిక్కుడు, బెండ వంటి కూరగాయలు చోరీకి గురయ్యారు. అర్థరాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు ట్రాలీలో వచ్చి కూరగాయలను ఎత్తుకెళ్లారు. ఉదయం యజమాని వచ్చి చూసేసరికి కూరగాయల షాపు గందరగోళంగా ఉంది. కూరగాయలన్నీ చెల్లాచెదురుగా పడిఉన్నాయి. దీంతో బాధిత వ్యాపారి లక్‌పతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూరగాయల చోరీ వల్ల దాదాపు రూ. 50 వేల వరకు నష్టం జరిగిందని వ్యాపారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు.

అయితే ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కూరగాయల ధరలు మండిపోతుండటంతో కొందరు దుండుగులు రాత్రి వేళల్లో మార్కెట్లలో చోరీలకు పాల్పడుతున్నారు. కూరగాయలు చోరీ కావటం పట్ల వ్యాపారులు లబోదిబోమంటున్నారు. వేలకు వేలు వెచ్చించి కూరగాయలు కొనుగోలు చేస్తే.. దొంగలు దోచుకెళ్తున్నారని ఆవేదన చెందుతున్నారు. డోర్నకల్ కూరగాయల మార్కెట్‌లో నైట్ వాచ్‌మెన్ లేకపోవడంతో దొంగలు పడుతున్నారని వాపోతున్నారు. కొందరు వ్యాపారులు రాత్రి వేళల్లో దుకాణం వద్దే కాపలాగా పడుకుంటున్నారు.

ANN TOP 10