ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. నేడు, రేపు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన దాదాపు రూ.50 వేల కోట్ల ప్రాజెక్టులకు ఈ రాష్ట్రాల్లో శంకుస్థాపన చేయనున్నారు. జులై 7న ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో పర్యటించనున్న ప్రధాని.. 8వ తేదిన తెలంగాణ, రాజస్థాన్‌లలో పర్యటించనున్నారు. అయితే తెలంగాణలోని వరంగల్ కాజీపేటలో రూ.500 కోట్లతో గూడ్స్ రైలు వ్యాగన్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఈ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల దేశంలో వ్యాగన్ల తయారీ సామర్థ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే ఇందులో ఆధునిక యంత్రాల ఏర్పాటుతో పాటు అత్యాధునిక రోబోటిక్ యంత్రాలు సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కర్మాగారం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు దగ్గర్లోని అనుబంధ యూనిట్లు కూడా ఏర్పాటు చేసేందుకు తోడ్పడుతుందని పీఎంఓ తెలిపింది.
అలాగే దాదాపు రూ.5,550 కోట్ల విలువైన 176 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణకు కూడా ప్రధాని పునాదిరాయి వేయనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది. పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కూమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వరంగల్ లోని ప్రధాని దిగే హెలిప్యాడ్‌తో సహా వేదిక ప్రాంగణానానికి చేరుకునే మార్గాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు ఆదేశించారు. అలాగే సభా వేదిక వద్ద సెక్యూరిటిని పెంచాలని సూచించారు. నిబంధనలను పాటించి వైద్య, విద్యుత్తు, అగ్నిమాపక, సమాచార శాఖలు తగిన చర్యలు పనులు చేపట్టాలని సూచించారు.









