AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

18 నెలల చిన్నారిపై వీధి కుక్క దాడి..

ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్‌: రాష్ట్రంలో చిన్నారులపై వీధి కుక్కల దాడి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తరచూ ఎక్కడో ఒకచోట ఇలాంటివి చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అంబర్‌పేటలో కుక్కల దాడిలో ప్రదీప్‌ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మరువకముందే.. రాష్ట్రంలో ఇలాంటి కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. ఖమ్మం జిల్లాలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా వీధి కుక్క దాడిలో 18 నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయ. కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్సీ కాలనీలో ఊటుకూరి గణేష్‌ కుమారుడు సిద్ధార్థకు ఇంటి బయట అన్నం తినిపిస్తుండగా.. నీళ్ల కోసం తల్లి ఇంట్లోకి వెళ్లింది. ఈ సమయంలో చిన్నారిపై వీధికుక్క దాడికి పాల్పడింది.

చిన్నారి ఏడుస్తుండటంతో తల్లి గమనించి బయటకు వచ్చి చూడగా.. వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలై కనిపించాయి. దీంతో బాలుడిని వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారికి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. సిద్దార్థకు కంటి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాలని కుటుంబసభ్యులు చూస్తున్నారు. అయితే చిన్నారికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

తమ గ్రామంలో విచ్చలవిడిగా వీధి కుక్కలు తిరుగుతున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని డిమాండ్‌ చేస్తోన్నారు. చిన్నారులను బయటకు పంపించాలంటేనే భయమేస్తోందని, అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో వరుస కుక్కకాటు ఘటనలు తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తోన్నాయి. ఆడుకోవడానికి పిల్లలను బయటకు పంపించాలంటేనే హడలెత్తిపోతున్నారు. అంబర్‌పేట ఘటన మరువకముందే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వీధి కుక్కల దాడి ఘటనలు జరిగాయి. బుధవారం కరీంనగర్‌ జిల్లాలో మూడు ప్రాంతాల్లో కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలయ్యాయి. ఇలాంటి తరహా ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10