బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. కొన్నిరోజులుగా ఆయన బీజేపీ నుంచి వెళ్లిపోతారని.. వార్తలు వస్తున్న క్రమంలో… ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని తపించే వ్యక్తిని తాను అన్నారు. రాష్ట్ర నాయకత్వాన్ని, హైకమాండ్‌ను ధిక్కరించి ఎలాంటి వ్యాఖ్యలు తాను చేయలేదన్నారు. తన నియోజకవర్గంలో అభివృధ్ధికోసం కిషన్ రెడ్డిని కలిసి వచ్చానన్నారు. తన వ్యక్తిగత స్వార్థం కోసం ఎప్పుడూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.
ఢిల్లీలో అస్సలు ఎలాంటి ప్రెస్ మీటే పెట్టలేదన్నారు. తాను అనని మాటల్ని దయచేసి వక్రీకరించొద్దని కోరుకుంటున్నానని రఘునందన్ అన్నారు. రెండు నెలలుగా తాను తన నియోజకవర్గానికే పరిమితం అయ్యానని తెలిపారు, రఘునందన్ రెండోసారి కూడా బీజేపీ నుంచి పోటీ చేసి దుబ్బాక నియోజకవర్గం నుంచి గెలిచి వస్తాడని ఈ సందర్భంగా చెప్పారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానన్నానని తెలిపారు.
అయితే అంతకుముందు… రఘునందన్ ఢిల్లీలో మాట్లాడుతూ.. పార్టీపై పలు వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. పార్టీ కోసం పదేళ్లుగా పని చేస్తున్నాను.. అధ్యక్ష పదవి కోసం నేను అర్హుడిని కాదా? పార్టీలో నాకు గౌరవం ఇవ్వాలి… సేవలకు తగిన ప్రతిఫలం దక్కకపోతే జాతీయ అధ్యక్షుడు నడ్డాపై ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తానని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు… మీడియాలో కథనాలు వచ్చాయి. ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ… పదేళ్లుగా పార్టీ కోసం తనలా ఎవరూ కష్టపడటం లేదని రఘునందన్ అన్నట్లు వార్తలు వచ్చాయి. . అయితే అలాంటి వ్యాఖ్యలు ఏవీ తాను అనలేదని తాజాగా రఘునందన్ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు.









