కాంగ్రెస్ లో చేరేందుకు సమాలోచనలు
తెలంగాణ బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీ మారీ ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం స్టార్ట్ అయ్యింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు,జాతీయ నాయకత్వం తనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో రఘునందన్ రావు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. దీంతో బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లో చేరే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ బీజేపీ నేత జితేందర్ రెడ్డి గురువారం చేసిన ట్వీట్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. జితేందర్ రెడ్డి ట్వీట్ చేసిన తర్వాత తెలంగాణ బీజేపీలో కలకలం రేగింది. అదే సమయంలో రఘునందన్ కూడా తన నిరసనను బాహాటంగా వ్యక్తం చేశారు. పార్టీలో తనకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని, ఫ్లోర్ లీడర్ అవకాశం కల్పించాలని అడుగుతున్నా పట్టించుకోవట్లేదని రఘునందన్ చెబుతున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గంలో చోటు కావాలని కోరిన స్పందించలేదని సన్నిహితులకు చెబుతున్నారు.
దుబ్బాకలో తాను ఎమ్మల్యేగా గెలిచిన తర్వాతే తెలంగాణలో బీజేపీకి హైప్ వచ్చిందని, తెలంగాణలో పార్టీకి జోష్ రావడానికి తానే కారణమని రఘునందన్ చెబుతున్నారు. తనను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించాలని కోరినా పట్టించుకోలేదని చెబుతున్నారు. దుబ్బాకలో బీజేపీ గెలిచిన తర్వాత పరిస్థితులు మారాయని, అందుకు కారణమైన తనకు మాత్రం బీజేపీ నాయకత్వం సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని రఘునందన్ రావు అసంతృప్తితో ఉన్నారంట. పార్టీలోకి తన తర్వాత వచ్చిన ఈటల, రాజగోపాల్ రెడ్డి వంటి వారిని పిలిచి తరచూ మాట్లాడుతున్నారని, తనను పక్కన పెట్టి అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని రఘునందన్ ప్రశ్నిస్తున్నారు.









