సింహాచలం గిరిప్రదక్షిణ సోమవారం కొనసాగుతోంది. ఆదివారం గిరిప్రదక్షిణ ప్రారంభంకాగా.. సోమవారం ఉదయానికి భక్తుల సంఖ్య పెరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ మార్గాలు ఎటు చూసినా కిక్కిరిసిపోయి కనిపించాయి.. భక్తులు అప్పన్నస్వామిని స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. భక్తుల హరినామస్మరణలు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ అప్పన్నస్వామి నిత్య , నిజరూప నమూనాలతో కూడిన పుష్ప అప్పన్న తొలి పావంచ దగ్గర నుంచి గిరి ప్రదక్షిణకు వెళ్లింది.
సింహాచలం నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా తెన్నేటి పార్కు, సీతమ్మధార, ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా భక్తులు తిరిగి సింహాచలం దేవస్థానానికి చేరుకుంటున్నారు. మొత్తం 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేసిన అనంతరం స్వామిని దర్శించుకుంటున్నారు. సోమవారం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా లక్షలాదిమంది భక్తులు అప్పన్నను దర్శించుకుంటున్నారు. స్వామి దర్శనం సులభంగా జరిగేందుకు వీలుగా అదనపు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు నేడు ఆర్జితసేవల్ని రద్దు చేశారు.









