సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సమావేశాల్లో ఎక్కడా కనిపించడం లేదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన.. ప్రస్తుతం నియోజకవర్గ రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా కనిపిస్తున్నారు.
ఈ క్రమంలో జగ్గారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ రావాల్సిందిగా ఆయనను పిలిచారు. దీంతో జగ్గారెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెళ్లారు. రేపు టీపీసీసీ ముఖ్యనేతలతో ఢిల్లీలో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఇందుకోసం 21 మంది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశాలు అందాయి. ఢిల్లీలో రేపు మధ్యాహ్నం జరగనున్న టీపీసీసీ రివ్యూ మీటింగ్‌లో ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది.