AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముగిసిన కేటీఆర్‌ ఢిల్లీ పర్యటన.. నగరానికి రాక

రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని మంత్రి కేటీఆర్ బృందం ఆదివారం ఉదయం హైదరాబాద్ బయలు దేరింది. రెండు రోజుల్లో ముగ్గురు కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశం అయి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై కేటీఆర్ చర్చించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరీదీప్ సింగ్ పురి, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌ లతో కేటీఆర్ బృందం భేటీ అయింది.

హైదరాబాదులో పలు ప్రాంతాల్లో రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అంశంపై రాజనాథ్ సింగ్‌తో మంత్రి కేటీఆర్ చర్చించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు అనుమతి ఇవ్వాలని, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అణువుగా స్కై వేలు ఫ్లై ఓవర్ నిర్మాణం జరిపేందుకు పూర్తిస్థాయి సహకారం అందించాలని హరిదీప్ సింగ్ పురికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా పట్టణాల్లో కార్మికుల సంఖ్య పెరుగుతున్నందున పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని కేటీఆర్ ప్రతిపాదించారు.

తెలంగాణ నుంచి అదనంగా 20 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులతో చర్చించిన సందర్భంలో కొంత సానుకూలత కొంత ప్రతికూలత వచ్చిందని మంత్రి తెలిపారు. తర్వాత రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్‌లో ఉన్న అంశాలు, హోంశాఖ పరిధిలోని భూములను అభివృద్ధి అవసరాల నిమిత్తం రాష్ట్రానికి బదలాయించాలని, ఇతర విషయాలపై చర్చించేందుకు తొలుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమయం ఖరారు చేశారు. అయితే మణిపూర్ ఘటనలపై అఖిలపక్ష సమావేశం, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఆలస్యం అవ్వడంతో… అపాయింట్‌మెంట్ రద్దు చేసినట్లు కేటీఆర్‌కు హోంశాఖ మంత్రి కార్యాలయ అధికారులు సమాచారం పంపారు. దీంతో రెండు రోజుల పర్యటన ముగియడంతో ఆదివారం ఉదయం ఎంపీలతో కలిసి మంత్రి కేటీఆర్ హైదరాబాదు బయలుదేరారు.

ANN TOP 10