AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇలా అయితే బీజేపీ విజయం సాధించడం కష్టమే..

అమిత్‌ షాకు తేల్చిచెప్పిన ఈటల, రాజగోపాల్‌రెడ్డి
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు బీజేపీ బలంగా కృషి చేస్తుందన్న స్పష్టమైన సంకేతాలను ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు తేల్చి చెప్పారు. లేదంటే రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించడం కష్టమని వారు స్పష్టం చేసినట్లు తెలిసింది. శనివారం వారితో అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమై దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల, రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్‌తో బీజేపీ కుమ్మక్కయినట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. అలాంటిదేమీ లేదన్న విషయాన్ని బలమైన నిర్ణయాల ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

అదీ కాకుండా.. ఓవైపు తమను ఢిల్లీకి పిలిచి, తమతో మాట్లాడుతూనే.. కేసీఆర్‌ కుమారుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడమేంటని వారు ప్రశ్నించారు. దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత విషయంలో ఈడీ, సీబీఐ మెతక వైఖరి అవలంబించాయని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటేనే తాము పార్టీలో ఉంటామని వారు పరోక్షంగా చెప్పినట్లు సమాచారం. వారిద్దరితో సమావేశమైన తర్వాత అమిత్‌ షా.. పార్టీ కార్యాలయంలోనే చాలాసేపు గడిపారు, ఆ తర్వాత కేటీఆర్‌తో అమిత షా అపాయింట్‌మెంట్‌ రద్దయినట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇతర సమావేశాలున్నందువల్ల కేటీఆర్‌తో భేటీ రద్దయినట్లు ఈ వర్గాలు చెప్పాయి. బీజేపీలో చేరినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో తాము విస్తృతంగా పనిచేస్తున్నామని, పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. అమిత షాకు వివరించినట్లు తెలిసింది. కానీ, పార్టీ రోజువారీ కార్యకలాపాల్లో గానీ, సమావేశాల్లో గానీ తమకు ప్రాఽధాన్యమివ్వడం లేదని, తమను శరణార్థులని, దిక్కులేక వచ్చినవాళ్లమని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో ప్రస్తుత పార్టీ అధ్యక్షుడి పాత్ర కూడా ఉందంటూ బండి సంజయ్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ANN TOP 10