కవిత ఏమైనా కడిగిన ముత్యమా?.. లేక మీ మధ్య కుదిరిన బంధమా? అంటూ సెటైర్లు
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు గల్లీలు సిగపట్లు పట్టి, ఢిల్లీలో కౌగిలించుకుంటున్నాయంటూ సెటైర్లు వేశారు. ఈ మేరకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ఎండగడుతూ ట్విట్టర్లో సుదీర్ఘ పోస్టును షేర్ చేశారు షర్మిల. ‘కుళ్లు కాయలను బంగారు సంచిలో దాచినా కంపు బయటపడదా ఏంటి? అలాగే ఉంది.. బీఆర్ఎస్, బీజేపీల అక్రమ మైత్రి. ఎంతదాచినా దాగదులే అన్నట్టు.. గల్లీలో సిగపట్లు, ఢిల్లీలో కౌగిలింతలు.. నిజం కాదని నిరూపించగలరా? బిహార్ లో జరిగిన బీజేపీయేతర పక్షాల సమావేశానికి మీకు ఆహ్వానం ఎందుకు అందలేదో చెప్పే దమ్ముందా మీకు? బిహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీపై కేసీఆర్ తీరు సరిగా లేదని చెప్పేశారు.
మరోవైపు శరద్ పవార్ అయితే ఏకంగా బీజేపీ , బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. ఇంకా మీ నాటకాలు దేనికి? తమిళనాడు మాజీ మంత్రిని ఎంత రాక్షసంగా అరెస్టు చేసారో చూసాం. మరి బలమైన సాక్ష్యాలున్నాయంటూ కవితను నాలుగుసార్లు ఆఫీసుల చుట్టూ తిప్పింది సీబీఐ. మరి ఆ తరువాత ఆమెను అరెస్టు ఎందుకు చేయదు? అసలు జాబితాలో ఆమె పేరే ఉండకపోవడమేందో! ఆమె కడిగిన ముత్యమా, లేక మీది కుదిరిన బంధమా? తెలంగాణ మంత్రుల మీద ఈడీ దాడులుంటాయి, కానీ అరెస్టులు ఉండవు. కాళేశ్వరం మీద నేను నిరంతరం పోరాటం చేస్తున్నా బీజేపీ మంత్రులు పనికిమాలిన ప్రకటనలు చేస్తారు తప్ప చర్యలుండవు. ఇంతలో కేసీఆర్ బీజేపీని పెద్దమనసుతో క్షమించేసి సభాముఖంగా దాడులు చేయడం బంద్ చేస్తారు. ఆయన కుమారుడు ఆగమేఘాల మీద ఢిల్లీకి పోయి అమిత్ షాను కలుస్తాడు. బీజేపీ ముఖ్యమంత్రులు నెలల తరబడి ఎదురుచూస్తున్నా దొరకని అపాయింట్ మెంట్ గాలికంటే వేగంగా ఈయనకు దొరుకుతుంది. సమాజ్దార్ కో ఇషారా కాఫీ అన్నట్టు.. సిగ్గులేకుండా, ఆత్మలు అమ్ముకుని చేతులు కలుపుతున్న వీరి నీచక్రీడలను నాలుగు కోట్ల ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే తెలంగాణ ప్రజలు వీరి స్నేహానికి బొందపెడతారు’ అని ఘాటుగా విమర్శించింది షర్మిల.