ఓ ప్రేమ జంట బలవన్మరణం
మెదక్ జిల్లాలో విషాదం
ఆదృశ్యమైన ఓ ప్రేమ జంట.. విగతజీవులుగా మారిన ఘటన మెదక్ జిల్లా నార్సింగిలో చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం కల్పన, ఖలీల్ అనే ప్రేమికులు అదృశ్యమవ్వగా.. నార్సింగి చెరువులో గురువారం శవాలుగా తేలారు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఖలీల్ అనే డ్రైవర్, కల్పన కొన్నేళ్లుగా ప్రేమించుకుంటుండగా.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వారిద్దరి మతాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో కల్పనకు రెండు నెలల క్రితం వేరొక వ్యక్తితో కుటుంబసభ్యులు వివాహం జరిపించారు. అయినా ఖలీల్‌పై ప్రేమ తగ్గలేదు. ఈ నెల 9న నార్సింగిలోని అత్తాగారింటికి కల్పన వచ్చింది. ఈ క్రమంలో సోమవారం ఇంటి నుంచి అదృశ్యమైంది.
తన కూతురు కనిపించడం లేదంటూ కల్పన తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం నార్సింగిలో బస్సు ఎక్కి రామాయంపేటలో యువతి దిగినట్లు పోలీసులు సీసీ కెమెరాలలో గుర్తించారు. రామాయంపేట నుంచి బైక్‌పై మరో వ్యక్తితో కల్పన వెళ్లినట్లు సీసీ కెమెరాలలో రికార్డు అయింది. దీని ఆధారంగా పోలీసులు గాలిస్తుండగా.. నార్సింగి చెరువు ఒడ్డున మంగళవారం బైక్, చెప్పులు కనిపించాయి. ఇవి ప్రేమజంటకి సంబంధించినవే అని భావించిన పోలీసులు.. చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానించారు.
మంగళవారం నుంచి బుధవారం వరకు గజ ఈతగాళ్లు, వలల సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా.. ఆచూకీ లభించలేదు. లాభం లేదనుకుని పోలీసులు ఇక చెరువులో గాలింపు చర్యలు ఆపేశారు. అయితే గురువారం ఉదయం ఇద్దరి శవాలు ఒక్కసారిగా చెరువులో తేలాయి. యువతి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం, తమ పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు.