తెలంగాణ బీజేపీలో అధిపత్య పోరు తార స్థాయికి చేరిందంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొంత కాలంగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మధ్య ఏమాత్రం పొసగటం లేదన్న వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే.. అలాంటిదేమీ లేదంటూ పార్టీ వర్గాలు కవర్ చేసే ప్రయత్నాలు చేసినా.. ఎప్పటికప్పుడూ వాటికి బలం చేకూరేలా సంఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. అంతేందుకు నిన్న నిర్వహించిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో.. కమల నేతలంతా పాల్గొనగా.. ఈటల, కోమటిరెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు. అంతేనా.. ఈరోజు అధిష్ఠానం నుంచి వాళ్లిద్దరికీ పిలుపు కూడా వచ్చింది. ఈ ఇద్దరి విషయం అధిష్ఠానానికి తెలిసి.. బుజ్జగింపు చర్యలు చేపట్టేందుకు హస్తిన నుంచి పిలుపు రావటంతో.. ఇక ఆ వార్తలు కన్‌ఫాం అయిపోయాయి.
ఇదంతా ఒక ఎత్తైతే.. ఇదే విషయంపై బండి సంజయ్‌ని కదిలిస్తే.. కీలక వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. తమ పార్టీ నేతలు ఇతర పార్టీలకు మారబోరని.. ఒకవేళ మారాలనుకుంటే మాత్రం అలాంటి వారిని ఆపబోమంటూ తేల్చేశారు. అక్కడితో ఆగకుండా.. మునిగిపోయే నావలో ఎక్కుతామంటే ఎవ్వరినీ ఎవ్వరూ ఆపరని చెప్పేశారు. అంటే.. వాళ్లు బయటికి వెళ్తున్నారనే కాదు.. ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారనేది కూడా బండి సంజయ్ కీలక క్లూ ఇచ్చేశారు.
ఇదిలా ఉంటే.. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హస్తిన నుంచి పిలుపొచ్చింది. అయితే.. తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఆరా తీశారు. కాగా.. ఈటల, కోమటిరెడ్డి పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ ఇద్దరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో దృష్టి పెట్టిన అధిష్ఠానం.. వాళ్లిద్దరినీ ఢిల్లీకి పిలిచింది.