అమ్మా.. నాన్న.. ఓ కుమార్తె.. ఈ చిన్న కుటుంబం ఎంతో హాయిగా గడిచిపోయింది. అయితే, ఉన్నట్టు ఉండి భార్యకు సుస్తీ చేయడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, ఆమెకు వచ్చింది ప్రాణాలు తీసే మహమ్మారని అక్కడకు వెళ్లాక తెలిసింది. దీంతో కుటుంబం తల్లడిల్లిపోయింది. కేన్సర్ రూపంలో ఆమెను మృత్యువు వెంబడిస్తోందని తెలిసిన ఇంటాయన కుమిలిపోయాడు. కుమార్తెకు ఈ వార్త తెలియడంతో తట్టుకోలేకపోయింది. దీంతో ముగ్గురూ ఒకేసారి ఈ లోకం నుంచి వెళ్లిపోయాలని నిర్ణయించుకున్నారు.
దీంతో కుటుంబం మొత్తం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అత్యంత హృదయ విదారకమైన ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం కొత్త కారాయి గూడెం గ్రామానికి చెందిన పోట్రు కృష్ణారావు (40), భార్య సుహాసిని (35), కుమార్తె అమృత(19) కలిసి నివాసం ఉంటున్నారు.
ఒకే కుటుంబంలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యలకు భార్య అనారోగ్యమే కారణమా? లేక మరేదైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.