టైటాన్ సబ్-మెరైన్ విషాదంపై టైటానిక్ చిత్ర దర్శకుడు, సాహసాలను ఇష్టపడే జేమ్స్ కామెరూన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేలిపోయిన జలాంతర్గామి భద్రత గురించి అనేక హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదని, దానికి మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నారు. టైటాన్ సబ్-మెరైన్ విస్తృతమైన ఆందోళనకు మూలంగా ఉందని, మునిగిపోయిన టైటానిక్ నౌకకు సమాంతరంగానే ప్రమాదం జరిగిందని చెప్పారు.
‘టైటానిక్ విపత్తు సారూప్యత తెలిసి నేను ఆశ్చర్యపోయాను.. కెప్టెన్ తన ఓడ ముందు మంచు గురించి పదేపదే హెచ్చరించాడు.. అయినప్పటికీ చీకటి రాత్రిలో మంచుపైకి వేగంగా నౌకను పోనిచ్చాడు.. తత్ఫలితంగా వందల మంది మరణించారు’ అని ఏబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ జేమ్స్ కామెరాన్ అన్నారు. ‘హెచ్చరికలు పట్టించుకోకుండా అదే ప్రాంతంలో తాజా ప్రమాదం జరగడం ఆశ్చర్యానికి గురిచేసింది.. ఇది నిజంగా చాలా విచిత్రమైంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. టైటాన్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో వెళ్లిన మినీ జలాంతర్గామి అధిక ఒత్తిడి కారణంగా పోలిపోయినట్టు అమెరికా కోస్ట్ గార్డ్ ధ్రువీకరించిన విషయం తెలిసిందే.
ఇక, 2012లో తాను స్వయంగా రూపొందించిన సబ్-మెరైన్ సాయంతో సముద్రంలోని అత్యంత లోతైన ప్రాంతానికి ఒంటరిగా వెళ్లొచ్చిన మొదటి వ్యక్తి కామెరూన్. జలాంతర్గామి ఒత్తిడికి గురై పేలిపోయే ప్రమాదం గురించి ఇంజనీర్లు మదిలో మొదటి వచ్చే ఆలోచన అని అన్నారు. సముద్ర అడుగున అన్వేషణ మొదలైనప్పటి నుంచి ప్రస్తుతం జరిగింది పీడకల లాంటిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.