AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌లో చేరడమంటే బీఆర్ఎస్‌కు సహకరించినట్లే: బండి సంజయ్

కాంగ్రెస్‌ పార్టీలో చేరడమంటే బీఆర్ఎస్‌కు సహకరించినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీఆర్ఎస్ నాయకల కంటే కాంగ్రెస్ పైనే ఎక్కువ నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని కేసీఆరే నడిపిస్తున్నారని.. 30 స్థానాల్లో ఆ పార్టీకి డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమం ద్వారా ఈ ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకోగా.. కరీంనగర్ పట్టణంలోని 57వ డివిజన్‌లో సంజయ్ ఇంటింటికీ వెళ్లి మోదీ పాలనను ప్రజలకు వివరించారు.

అనంతరం అక్కడ ఏర్పాట చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ నుంచి ఎవరు గెలిచినా మళ్లీ వెళ్లేది బీఆర్ఎస్‌లోకేనని అన్నారు. 9 ఏళ్లుగా ప్రజలను పట్టించుకోని కేసీఆర్ ప్రచారం కోసం వెయ్యి కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏనాడూ అమరవీరుల కుటుంబాల ముఖం చూడని కేసీఆర్.. ఇవాళ పిలిచి సన్మానం చేయటం, శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పటం పెద్ద జిమ్మిక్కు అని అన్నారు.

ప్రజలను ఆదుకోవాలని లక్ష్యం ఉన్న నాయకులెవరూ కాంగ్రెస్ పార్టీలో చేరవద్దని కోరుతున్నానని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనని చెప్పారు. కేసీఆర్‌కు సైతం బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పైనే నమ్మకం ఎక్కువ అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న కాళ్లకు గజ్జె కట్టి పాట పాడారని.. కేసీఆర్ మాత్రం గద్దర్ గజ్జె కడితే తెలంగాణ వచ్చిందా ? అని వెటకారంగా మాట్లాడారన్నారు. గద్దర్ ఇప్పుడు కేసీఆర్‌ను నిలదీయాలని సూచించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో పక్కా ఆధారాలు సేకరించి ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారని అన్నారు. తెలంగాణలో తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని సింగిల్‌గానే బరిలోకి దిగుతామని చెప్పారు.

ANN TOP 10