తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు
మరో రెండు, మూడు రోజులు విస్తారంగా వర్షాలు
ఈ ఏడాది నైరుతు రుతుపవనాల రాక ఆలస్యమైంది. గతేడాది మే చివర్లోనే నైరుతి పలకరించగా.. ఈ ఏడాది నైరుతి రాక లేట్ అయింది. వర్షాల కోసం రైతన్నలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సాగుకు సిద్ధమైన అన్నదాతలు తొలకరి కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో దక్షిణ భారతదేశంలోని మరికొన్ని భాగాలకు నైరుతి విస్తరించే అవకాశాలున్నట్లు తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య దిశ నుంచి తెలంగాణలోకి వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, మహమూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాద్రాద్రి భువనగిరి, రంగారెడ్డి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. సూర్యాపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా వేడిగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు.