అనంతపురం జిల్లా (Anantapuram District) తాడిపత్రి మండలంలో దారుణం జరిగింది. రూరల్ పరిధిలోని చుక్కలూరు రోడ్లో వున్న శ్రీనిధి నల్ల బండల ఫ్యాక్టరీలో నిద్రిస్తున్న భార్య, భర్తలతో పాటు, మరో అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. నల్లపరెడ్డి, సరస్వతిలతో పాటు, పూజిత అనే మరో యువతికి తీవ్ర గాయాలు కావటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తాగొద్దని మందలించిన దంపతులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు అని తెలుస్తోంది.
చుక్కలూరు పారిశ్రామిక వాడలోని శ్రీనిధి నల్ల బండల పాలిష్ పరి శ్రమలో నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి పరిశ్రమ ఆవరణలో మంచంపై నిద్రిస్తున్నారు. అదే ఫ్యాక్టరీలో పని చేసే మల్లికార్జున కుమార్తె పూజిత కూడా వీరి పక్కనే మం చం వేసుకుని నిద్రిస్తోంది.
రాత్రి 11.30 గంటల సమయంలో సరస్వతి మరిది రామేశ్వర్ రెడ్డి నిద్రిస్తున్న నల్లపురెడ్డి, సరస్వతి పై పెట్రోల్ పోశాడు. మెలకువ వచ్చిన సరస్వతి ఏం చేస్తున్నావురా అని అరిచేలో గానే నిప్పంటించాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే నిద్రిస్తున్న పూజితకు కూడా మంటలు అంటుకుని చేతులు కాలాయి.