ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల వేళ నేతల కీలక భేటీలు హాట్‌టాపిక్‌గా మారాయి. బుధవారం ఉదయం బంజారాహిల్స్‌లోని నల్లొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు. పార్టీలోని చేరికలు, విబేధాలను పక్కనపెట్టడం, వచ్చే ఎన్నికల్లో గెలుపొందడానికి అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరికపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న తనకు చెప్పకుండా సునీల్ చెప్పారని పొంగులేటి, జూపల్లిని చేర్చుకుంటుండటంపై వెంకటరెడ్డి అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను బుజ్జగించేందుకు రేవంత్ రెడ్డి వెళ్లినట్లు సమాచారం.
ఈ భేటీ అనంతరం ఎంపీలు వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తామిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, కలిసి పనిచేస్తామని రేవంత్ తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు అందరం కలిసి పనిచేస్తామని, పార్టీలో ఎలాంటి విబేధాలు లేవన్నారు. నల్లగొండ జిల్లాలో ఏ చేరికలు జరిగినా జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల అనుమతి, చర్చలు లేకుండా జరగవని స్పష్టం చేశారు. స్థానిక నేతలను అడగకుండా ఎవరినీ తీసుకోమన్నారు. తాము అపూర్వ సోదరులుగా కలిసి ఉంటామని చెప్పారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ రెండు ఎంపీ సీట్లు గెలిచిందని, వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుంటామని రేవంత్ తెలిపారు.
పొంగులేటి, జూపల్లితో పాటు మరికొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని, వారిని కూడా చేర్చుకుని బలపడతామని వెంకటరెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. రేవంత్ రెడ్డి, తాను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కలిసి ఉంటామన్నారు. కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరూ కలిసి ఒకే కారులో జూపల్లి నివాసానికి వెళ్లారు. జూపల్లితో సమావేశమై ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ముగ్గురు నేతలు కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా పొంగులేటిని కూడా రేవంత్ ఆహ్వానించనున్నారు.