AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల అధికారుల బృందం

కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యే ఛాన్స్
ఎన్నికల నిర్వహణపై కీలక సూచనలు

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికలకు మరో ఐదు నెలలు మాత్రమే సమయం ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఎన్నికల నిర్వహణకు ఇప్పటినుంచే ఏర్పాట్లను షురూ చేసింది. అందులో భాగంగా నేడు కేంద్రం ఎన్నికల సంఘం బృందం రాష్ట్రానికి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా సీఈసీ అధికారులు పర్యటించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్‌లో షెడ్యూల్ వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. 2018లో ముందస్తు ఎన్నికలు జరిగిన సమయంలో కూడా అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ రాగా.. నవంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక డిసెంబర్‌లో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. ఈ సారి కూడా ఇంచుమించుగా అలాగే షెడ్యూల్ ఉండే అవకాశముందని తెలుస్తోంది. అక్టోబర్‌లో 5-15 తేదీల మధ్య ఈసీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయవచ్చని చెబుతున్నారు. ఈ వార్తల క్రమంలో సీఈసీ అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తెలంగాణకు రానున్న సీఈసీ బృందం.. రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికలకు ఏర్పాట్లపై చర్చించి పలు కీలక సూచనలు చేయనుంది. ఈవీఎంల పరిశీలన, ఓటర్ల తుది జాబితా సిద్దం చేయడం, భద్రతా ఏర్పాటు, తదితర అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా ఇవాళ హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లోనే సీఈసీ బృందం మకాం వేయనున్నారని, కలెక్టర్లు, ఎస్పీలు, ఐటీ శాఖ అధికారులతో సమావేశమయ్యే అవకాశముందని అంటున్నారు.

ANN TOP 10