సముద్రంలో ఉన్న టైటానిక్ మహానౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ జలాంతర్గామి గల్లంతయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రంలో ఆచూకీ లేకుండా పోయింది. ప్రమాద సమయంలో సదరు జలాంతర్గామిలో ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. జలాంతర్గామితో కమ్యూనికేషన్ కట్ అయిన విషయం తెలియడంతో అమెరికా, కెనడాకు చెందిన రక్షణ బృందాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.
గల్లంతైన టైటానిక్ పర్యాటక జలాంతర్గామిలో 70 నుంచి 96 గంటలకు సరిపడ మాత్రమే ఆక్సిజన్ ఉందని అధికారులు తెలిపారు. మిస్సైన జలాంతర్గామి కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను దగ్గరి నుంచి చూపించేందుకు అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ ఈ టూర్ లను నిర్వహిస్తోంది. దీనికోసం చిన్నపాటి జలాంతర్గామిని వినియోగిస్తోంది. ఈ జలాంతర్గామిలో ముగ్గురు గెస్టులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. 22 అడుగులు పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు.