AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రంగంలోకి ట్రబుల్ షూటర్ .. కాంగ్రెస్‌లో జోష్

తెలంగాణ ఎన్నికల కోసం డీకే శివకుమార్‌కు కీలక బాధ్యతలు..
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యవహారాలను డీకే శివకుమార్‌కు పార్టీ అధిష్టానం అప్పగించింది. దీంతో రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన పనిచేస్తున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగి వర్క్ కూడా మొదలుపెట్టారు. నేతలను సమన్వయం చేసుకునే బాధ్యతలతో పాటు ప్రచార బాధ్యతలు, ఇతర కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ట్రబుల్ షూటర్‌గా పేరున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను తెలంగాణ ఎన్నికల కోసం పార్టీ హైకమాండ్ ఉపయోగించుకోనుంది.

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికను ఆ జిల్లాలోని కొంతమంది పార్టీ సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు పార్టీలో చేరితే తమ టికెట్‌కు ఎసరు పడుతుందనే భావనతో అసంతృప్తితో ఉన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా సీఆర్ జగదీశ్వరరావు, నాగర్ కర్నూల్ ఇంచార్జ్‌గా నాగం జనార్థన్ రెడ్డి ఉన్నారు.

జూపల్లి పార్టీలో చేరితే తమకు ప్రాధాన్యత తగ్గిపోతుందని వారిద్దరూ భావిస్తున్నారు. దీంతో వారిద్దరిని సమన్వయపరిచే బాధ్యతను డీకే శివకుమార్‌కు ఢిల్లీ హైకమాండ్ అప్పగించింది. జూపల్లి తనతో పాటు తన అనుచరులలో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్దన్ రెడ్డిపై జూపల్లి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత హర్షవర్దన్ రెడ్డి కారెక్కడంతో.. బీఆర్ఎస్‌లో జూపల్లి టికెట్‌పై డైలమా ఏర్పడింది. ఈ క్రమంలో పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయడంతో.. ఈ నెల 22న పొంగులేటితో కలిసి హస్తం గూటికి చేరనున్నారు.

ఇప్పుడు జూపల్లి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో.. కొల్లాపూర్ టికెట్ ఆయనకే కేటాయించే అవకాశాలుంటాయి. దీంతో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతలు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వాళ్లు వేరే పార్టీ వైపు వెళ్లకుండా బుజ్జగించే బాధ్యతలను డీకే శివకుమార్‌కు పార్టీ అప్పగించింది. ఈ క్రమంలో అసంతృప్తి నేతలతో డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు.

ANN TOP 10