మెగా కుటుంబంంలో సంబర వాతావరణం నెలకొంది. అందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు, హీరో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. సోమవారం రాత్రే అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అయిన ఉపాసన.. మంగళవారం తెల్లవారు జామున ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. రీసెంట్‌గానే రామ్‌చరణ్, ఉపాసన తమ 11వ పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు మరో శుభవార్తను తెలియజేశారు. వీరికి 2012లో వివాహం అయ్యింది. పాప పుట్టిన సంగతి తెలియగానే కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు సంతోషంగా ఉన్నారు.
భర్త రామ్ చరణ్‌తో పాటు తల్లి శోభన కామినేని, అత్తమ్మ సురేఖ కొణిదెలతో కలిసి సోమవారం సాయంత్రం అపోలో ప్రో హెల్త్ హాస్పిటల్‌కు ఉపాసన వెళ్లారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. డిసెంబర్‌లో రామ్ చరణ్, ఉపాసన కలిసి తాము పేరెంట్స్ కాబోతున్నామంటూ అధికారికంగా చేసిన ప్రకటనతో మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆ మధ్య ఓ సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ జూలైలో చరణ్, ఉపాసనలకు బిడ్డ పుట్టే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఇంకా ముందుగానే వారింట సంబర వాతావరణం నెలకొంది.