ఒడిశాలోని ప్రముఖ శ్రీ క్షేత్రం పూరీ జగన్నాథుని రథయాత్రకు సర్వసిద్దమైంది. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించి తరువాత మంగళహారతి ఇస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ రథాలపై బంగారు చీపురుతో ఊడ్చిన రథయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు రథాలను లాగుతారు. సాయంత్రంలోగా రథాలు గుండిచా మందిరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ సారి 10 లక్షల మంది వస్తారని అంచనా.
ఇక, నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలు సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన కార్డన్ వద్దకు చేరుకున్నాయి. దీనికి ముందుగా అర్చకులు ఆలయం నుంచి జగన్నాథుడి మెడలోని పూల మాలలు తెచ్చి మూడు రథల మధ్య ఉంచి పూజలు చేశారు. ఆ తరువాత హరిబోల్ నినాదాల మధ్య పోలీసులు, భక్తులు కలిసి శ్రీక్షేత్ర కార్యాలయం నుంచి జగన్నాథ సన్నిధి వరకు రథాలు లాక్కెళ్లారు.
మరోవైపు, బిడ్డల రాకకోసం ఎదురు చూస్తున్న గుండిచాదేవి మందిరానికి సర్వంగ సుందరంగా అలంకరించారు. ఇక, సోమవారం ఉదయం నుంచి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. అన్ని రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. సాయంత్రానికే పూరీ జనసంద్రంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసింది. బారికేడ్లను ఏర్పాటు చేసి, వాహనాలు రాకపోకలు నియంత్రిస్తున్నారు. ఆయాచోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.