హైదరాబాద్‌లోని బన్సిలాల్‌పేటలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ తల్లి.. తన ఇద్దరు కవల పిల్లల్ని ఎనిమిదో అంతస్తు నుంచి కింద పడేసి.. అనంతరం తాను కూడా దూకేసి ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ఇందుకు కారణం.. కట్టుకున్న భర్త, అత్తమామల వేధింపులే అని తెలుస్తోంది. అయితే.. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బన్సీలాల్‌పేట జీవైఆర్ బస్తీలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలోని 8వ అంతస్తులో నివసించే దుర్గమ్మ కూతురైన సౌందర్య (26)కు బోడుప్పల్‌కి చెందిన గణేష్‌తో మూడున్నర సంవత్సరాల కిందట వివాహం జరిగింది. సౌందర్య, గణేష్ దంపతులకు ఏడాదిన్నర వయసున్న ఇద్దరు కవల పిల్లలున్నారు.
అయితే.. వెంకన్న, దుర్గమ్మ దంపతులకు నలుగు కూమర్తెలు కాగా.. సౌందర్య చిన్నమ్మాయి. పెళ్లి సమయంలో గణేష్‌కు రెండున్నర లక్షల కట్నం ఇచ్చారు. దాంతో పాటు యాదాద్రి వద్ద ఉన్న ల్యాండ్ కూడా ఇచ్చారు. అయితే.. ఆ ల్యాండ్ సౌందర్య పేరు మీద ఉంది. ఉప్పల్‌లోని ఓ కటింగ్ షాప్‌లో పని చేస్తోన్న గణేష్.. పెళ్లైన కొద్ది రోజుల నుంచే వేధింపులు ప్రారంభించాడు. అదనపు కట్నం తీసుకురావలంటూ.. గణేష్, అత్తింటి వాళ్లు సూటిపోటి మాటల్తో ఇబ్బంది పెడుతున్నారు.
ఈ క్రమంలోనే సోమవారం రోజున సౌందర్య తన ఇద్దరు పిల్లల్ని ఎనిమిదో అంతస్తు నుంచి కింద పడేసి.. అనంతరం తాను కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రస్థాయిలో గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.