మెుక్కల పేరుతో స్కాములు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. హరితహారం స్కీముకు లెక్కాపత్రం లేదని ఆక్షేపించారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా అడవులు రాలేదని.. కోతులు వాపస్ పోలేదని సెటర్లు పేల్చారు. కానీ సీఎం కేసీఆర్ పెంచిన విషపు మెుక్కలతో సామాన్యుల ప్రాణాలకు దిక్కులేకుండా పోయిందని ఆక్షేపించారు. నీతులు చెప్పే నేతలో చెట్లను నరుకుతుంటే.. హరితోత్సవాలు ఎందుకు చేయాలని బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇవాళ తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో స్వయంగా మెుక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ మెుక్కలు నాటారు. అయితే ఈ కార్యక్రమంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.