తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TS RTC) ఉద్యోగులు ఔదార్యం చాటారు. మనుషుల్లో మానవత్వం ఎప్పటికి చనిపోదని నిరూపించారు. ప్రజా రవాణాలో మెరుగైన సేవలందిస్తున్న టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు..ఇప్పుడు మరో మంచి పని చేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్(Bus)లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుతో బస్సులోనే తుదిశ్వాస విడిచాడు.
అయితే బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకోకుండా ..బస్ డ్రైవర్,కండక్టర్ మానవత్వదృక్పథంతో ఆలోచించారు. చనిపోయిన ప్రయాణికుడి మృతదేహాన్ని అదే బస్సులో అతడి స్వగ్రామమైన మోదుగుల గూడెం(Modugulagudem)కు తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వాస్తవంగా ఈసంఘటన ఈనెల 14వ తేదిన జరిగింది. అయితే మంచికి ఆకర్షణ తక్కువ కదా..అందుకే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ బస్ డ్రైవర్, కండక్టర్ మానవత్వంతో స్పందించిన తీరు చూసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar)వారిని అభినందించారు.