AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లవర్స్‌ను చంపేసి.. రాళ్లతో కట్టేసి.. మొసళ్లు ఉన్న నదిలో పడేసి..

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. 18 ఏళ్ల యువతి, ఆమె 21 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన మహిళ కుటుంబ సభ్యులు ఆపై వారి శరీరాలకు బలమైన రాళ్లు కట్టి మొసళ్లు తిరిగే నదిలో పడేశారు. వీటిని పరువు హత్యలుగా పోలీసులు భావిస్తున్నారు. మొరేనా జిల్లాలోని రతన్‌బసాయ్ గ్రామంలో జరిగిందీ దారుణం. మృతులను శివానీ తోమర్, రాధేశ్యామ్ తోమర్‌గా గుర్తించారు.

పొరుగూరికి చెందిన రాధేశ్యామ్‌తో రిలేషన్‌షిప్‌ను తీవ్రంగా పరిగణించిన శివానీ కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారు. తన కుమారుడు, శివానీ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదంటూ రాధేశ్యామ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్యల విషయం వెలుగచూసింది. వీరిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లిపోయినట్టు పోలీసులు తొలుత భావించారు. అయితే, వారిద్దరూ కలిసి వెళ్లడాన్ని గ్రామస్థులెవరూ చూడకపోవడంతో అనుమానించారు.

యువతి తండ్రి, బంధువులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారిద్దరినీ హత్య చేసినట్టు అంగీకరించారు. ఈ నెల 3న వారిద్దరినీ కాల్చి చంపామని, ఆ తర్వాత వారి శరీరాలకు భారీ రాళ్లు కట్టి చంబల్ నదిలో పడేసినట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10