హైదరాబాద్ వాసులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ప్రయాణికుల అలసరాలను దృష్టిలో ఉంచుకొని రూట్‌ల పొడిగింపు చేపట్టి మరిన్ని బస్సులు తీసుకొచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఒక చోట నుంచి అనుకున్న చోటుకి వెళ్లాలంటే ప్రయాణికులు చాలాసార్లు రెండు, మూడు బస్సులు మారాల్సి ఉంటుంది. దీంతో ఒక్కోసారి బస్సులు లేక ప్రత్యామ్నాయంగా ఆటోలలో వెళ్తుంటారు. నగరంలోని అనేక రూట్లలో నేరుగా బస్సు సదుపాయం లేకపోవడం వల్ల ప్రయాణికులలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆర్టీసీ అధ్యయనంలో తెలిసింది. దీంతో ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఉన్న రూట్‌లలో లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేవిధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే కొన్ని రూట్‌లను పొడిగించి ఈ తరహా బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు మరిన్ని రూట్‌లపైన దృష్టి సారించారు. ముఖ్యంగా ఉద్యోగులు, హౌస్‌కీపింగ్ సిబ్బంది, ఔటర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగరంలోకి రాకపోకలు సాగించే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూట్‌ల పొడిగింపును చేపట్టినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
జగద్గిరి గుట్ట నుంచి ప్రతిరోజూ వందలాంది మంది ఉద్యోగులు ఐటీ సంస్థల్లో పనిచేసేందుకు గచ్చిబౌలి, మాదాపూర్ వైపు ప్రయాణిస్తున్నారు. వీళ్లు అక్కడికి వెళ్లాలంటే కేపీహెచ్‌బీ వదద్ బస్సు మారాల్సి ఉంటుంది. ఇక్కడ చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఆర్టీసీ ఇకపై జగద్గిరి గుట్ట నుంచి నేరుగా ఐటీ కారిడార్ వైపు బస్సు చేరుకునేలా చర్యలు చేపట్టారు. అలాగే ఈసీఐఎల్ నుంచి మేడ్చల్, షామీర్ పేట్ వెళ్లాలంటే గతంలో రెండు బస్సలు మారాల్సి వచ్చేది. ఇప్పుడు ఈసీఐల్ నుంచి నేరుగా మేడ్చల్, షామీర్‌పేట్ వేళ్లేలా బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా అనేక చోట్లలో కొత్త రూట్లను ఎంపిక చేస్తూ అదనపు బస్సులు ప్రవేశపెట్టి ప్రయాణికుల ప్రయాణం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.