తెలంగాణలో నిన్న పలుచోట్ల వర్షాలు కురవగా.. నేడు, రేపు కూడా పలు జిల్లాల్లో వానలు పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
అలాగే నేడు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక రేపు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొంది.
అటు సోమవారం మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పుల ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఇక 13 నుంచి 15వ తేదీ వరకు కూడా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని చెప్పారు. ఈ మేరకు రానున్న ఐదు రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అయితే నిన్న హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో స్వల్ప వర్షాలు కురిశాయి. ఈ రోజు కూడా హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి చిరుజల్లులు పడే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.