కాంగ్రెస్‌పైనే ఫోకస్
నిర్మల్,నాగర్‌కర్నూలు సభల్లో మాట్లాడిన తీరే నిదర్శనం
గులాబీ బాస్ కేసీఆర్ రూటు మార్చారా? అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.. నిర్మల్, నాగర్‌కర్నూలు సభల్లో బీజేపీని పల్లెత్తు మాట మాట్లాడకుండా కాంగ్రెస్‌పైనే ఆరోపణలు చేశారు. దీంతో ఆయన ప్రధానంగా కాంగ్రెస్‌పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయ సమీకరణాల్ని పూర్తిగా మార్చేసే ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మీడియా సమావేశం కానీ.. సోషల్ మీడియాలో పోస్టులు కానీ.. వేదిక ఏదైనా సరే.. కేంద్రంలోని మోదీ సర్కారుపై విరుచుకుపడే కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ లు ఇద్దరూ ఇటీవల కాలంలో మోదీ సర్కారుపై ఫైర్ కావటం తగ్గించేయటం తెలిసిందే.
దీనికి సంబంధించిన ఊహాగానాలు కొద్ది వారాలుగా వినిపిస్తున్నా.. దానికి నిజమని నమ్మే ఫ్రూప్ లు దొరకని పరిస్థితి. ఆ లోటును తీరుస్తూ సోమవారం నిర్మల్ లో జరిగిన బహిరంగ సభలోనూ.. మిగిలిన వేదికల వద్ద మాట వరసకు కూడా మోదీ ప్రస్తావన తీసుకురాలేదు.
ఇటీవల కాలంలో ఎక్కడ మాట్లాడినా.. కేంద్రంపై నిందలు వేయటంతో పాటు.. మోదీ సర్కారు వైఫల్యాల్ని బలంగా ప్రస్తావించేవారు. దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్లు ఇస్తూ కమలనాథులను ఉక్కిరిబిక్కిరి చేసేవారు.
అసెంబ్లీ ఎన్నికలు నాలుగైదు నెలలకు వచ్చేసిన వేళలో.. తమకు సవాళ్లు విసరుతున్న బీజేపీపై విరుచుకుపడేందుకు భిన్నంగా.. వారిని కానీ వారి పేరును కానీ మాట వరసకు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న కేసీఆర్ వైనం తొలిసారి నిర్మల్ సభలో బయటకు వచ్చిందంటున్నారు. అయిన్పటికీ.. ఒక్క సభతో నిర్ధారణకు రాలేమన్న వారికి మంగళవారం నాగర్ కర్నూలు సభతో కన్ఫర్మ్ అయినట్లుగా చెబుతున్నారు.
కేసీఆర్ రూటు మార్చారన్నది ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. సొంత పార్టీ నేతలు సైతం బీజేపీపై విరుచుకుపడే తీరును తగ్గించుకోవటం.. తమ ఫోకస్ మొత్తం కాంగ్రెస్ మీద పెట్టటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిర్మల్.. నాగర్ కర్నూలు సభల్లో తన ఫోకస్.. టార్గెట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద పెట్టిన కేసీఆర్ తీరును చూసిన తర్వాత.. బీఆర్‌ఎస్ కు బీజేపీ రహస్య మిత్రుడిగా మారిందన్న మాట వినిపిస్తోంది.
నిర్మల్ సభలో కమలనాథులపై విరుచుకుపడని కేసీఆర్ తీరుతో కాస్తంత విస్మయానికి గురైన వారు.. నాగర్ కర్నూల్ సభలో అయినా బీజేపీపై మండిపడతారని ఆశించారు. అయితే.. నిర్మల్ లో మాదిరే నాగర్ కర్నూల్ లోనూ ఒక్క మాట కూడా అనకుండా ఉన్న వైనం చూశాక.. బీఆర్‌ఎస్–బీజేపీల మధ్య కొత్త బంధం మొదలైందన్న మాట వినిపిస్తోంది.