AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మీరు విసిరే బురదలోనూ ‘కమలం’ వికసిస్తుంది

రాజ్యసభలో విపక్షాల తీరు బాధాకరం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వంపై విపక్షాలు ఎంతగా బురదజల్లినా ‘కమలం’ అంతగా వికసిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అదానీ వ్యవహారంపై రాజ్యసభలో విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తూ తన ప్రసంగానికి అడ్డు తగలడంపై ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమన్నారు.

రాజ్యసభలో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. ‘నేను ఈ ప్రతిపక్ష ఎంపీలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మీరెంత బురద జల్లితే..కమలం అంతలా వికసిస్తుంది’ అన్నారు. వారి వద్ద (ప్రతిపక్షాలు) బురద ఉందని, తన వద్ద గులాల్‌ ఉందని వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లలో 11 కోట్ల ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఇచ్చాం, తొమ్మిదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 48 కోట్ల జనధన్‌ ఖాతాలు తెరిచాం’ అన్నారు. ఓ వైపు ప్రధాని మోదీ మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు అదానీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ పరిపాలించిన సమయంలో అభివృద్ధికి ఆటంకాలు సృష్టించిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పరిపాలించిన ఆరు దశాబ్దాల కాలంలో మన దేశం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, అదే సమయంలో చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో ఆ సమస్యలకు పరిష్కారాలను అందజేయవలసిన బాధ్యత కాంగ్రెస్‌ పార్టీకి ఉందని, కానీ ఆ పార్టీ నేతల ప్రాధాన్యతలు, ఉద్దేశాలు వేరు అని తెలిపారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు శాశ్వత పరిష్కారాల కోసం కృషి చేస్తున్నామన్నారు.

ANN TOP 10