తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీఎస్‌పీఎస్సీలో ఇప్పటికే చాలా పేపర్లు లీక్ అయిన తర్వాత కూడా అదే సిబ్బందితో పరీక్ష నిర్వహిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఎలా స్పందిస్తుందన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కు సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్లను కూడా జారీ చేశారు. వచ్చే ఆదివారం పరీక్ష నిర్వహించడానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సమయంలో కోర్టులో పిటిషన్ వేయడంపై ఉత్కంఠ నెలకొంది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 503 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. 11వ తేదీన పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో.. టీఎస్‌పీఎస్సీ పలు కీలక సూచనలు చేసింది.
పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని తెలిపింది. ఉదయం 10.15 తర్వాత అభ్యర్థులను ఎవరినీ కూడా అనుమంతించేది లేదని తేల్చి చెప్పింది. అందువల్ల అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. అలాగే ఓఎంఆర్ పత్రంలో ఎవరైనా తప్పులు చేసినట్లైతే దానికి బదులుగా కొత్తది ఇవ్వలేమని పేర్కొంది.