AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైలు ప్రమాదానికి కారణాలు వెల్లడించిన రైల్వే బోర్డు..

ఒడిశాలో శుక్రవారం జరిగిన రైళ్ల ప్రమాదానికి కారణాలను రైల్వే బోర్డు ఆదివారం వెల్లడించింది. రైళ్ల వేగం అనుమతికి లోబడి ఉందని, అయితే సిగ్నలింగ్ లోపం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపింది. మూడు రైళ్లు ఢీకొన్నాయని తప్పుగా భావించరాదని, కేవలం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే ప్రమాదానికి గురైందని తెలిపింది. ముడి ఇనుముతో ఉన్న గూడ్స్‌ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో తీవ్రత ఎక్కవైందని చెప్పింది.

రైల్వే బోర్డు ఆపరేషన్, బిజినెస్ డెవలప్‌మెంట్ సభ్యురాలు జయ వర్మ సిన్హా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఒడిశాలోని బహనగ బజార్ స్టేషన్‌లో నాలుగు రైల్వే లైన్లు ఉన్నాయని చెప్పారు. వీటిలో రెండు స్ట్రెయిట్ మెయిన్ లైన్స్ అని, మిగిలిన రెండూ ఇరువైపులా ఉన్న లూప్ లైన్స్ అని చెప్పారు. మెయిన్ లైన్స్ రెండూ లూప్ లైన్లకు మధ్యలో ఉన్నాయన్నారు. ఏదైనా రైలును ఈ స్టేషన్లో ఆపాలంటే లూప్ లైన్‌లో ఆపుతామని చెప్పారు. ఈ ప్రమాదం జరిగినపుడు రెండు మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎదురెదురుగా వచ్చాయన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగినపుడు రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు దారి ఇవ్వడం కోసం మరో రెండు రైళ్లను నిలిపి ఉంచినట్లు తెలిపారు.

ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ స్టేషన్‌లో ఆగవని చెప్పారు. లూప్‌లైన్లలో రెండు గూడ్స్ రైళ్లు ఉన్నాయన్నారు. కోరమాండల్, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం రెండు మెయిన్ లైన్లను క్లియర్ చేసి ఉంచినట్లు తెలిపారు. అంతా సజావుగానే సిద్ధంగా ఉందని, ఆకుపచ్చ (Green) సిగ్నల్ ఉందని చెప్పారు. గ్రీన్ సిగ్నల్ అంటే రైలును గరిష్ఠ వేగంతో నడపవచ్చునని చెప్పారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు అనుమతించిన గరిష్ఠ వేగం గంటకు 130 కిలోమీటర్లు అని, అయితే ఆ రైలు గంటకు 128 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని చెప్పారు. బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 126 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని, దీని వేగం కూడా అనుమతికి లోబడే ఉందని చెప్పారు. ఈ రైళ్లు మితిమీరిన వేగంతో ప్రయాణించలేదన్నారు. గ్రీన్ సిగ్నల్ ఉందన్నారు. ఏదో కారణం చేత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైందన్నారు.

ఈ కారణం ఏమిటో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందన్నారు. ప్రాథమిక నివేదిక ప్రకారం సిగ్నలింగ్ లోపం ఉన్నట్లు సంకేతాలు వచ్చాయన్నారు. అయితే ఈ విషయంలో తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు. మూడు రైళ్లు ఢీకొన్నట్లు తప్పుగా భావించకూడదని చెప్పారు. కేవలం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే ప్రమాదానికి గురైందన్నారు. దీని ఇంజిన్ లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైలుపై పడిందని, గూడ్స్ రైలులో ముడి ఇనుము లోడు ఉండటంతో కోరమాండల్ రైలు ఇంజిన్, పెట్టెలపై పూర్తి ప్రభావం పడిందని చెప్పారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో చాలా సురక్షితమైన ఎల్‌హెచ్‌బీ బోగీలు ఉన్నాయన్నారు. అవి తలక్రిందులయ్యే అవకాశం ఉండదన్నారు. కానీ ప్రస్తుత సందర్భంలో మొత్తం ప్రభావం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌పైనే పడినందువల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు.

ANN TOP 10