288 మంది మృతి : రైల్వేశాఖ
మరో 900 మందికి గాయాలు
చెల్లాచెదురుగా పడిన బోగీలు.. రక్తం తడారని రైళ్ల శకలాలు.. పట్టాల మధ్యనే తరలించేందుకు సిద్ధం చేసిన మృతదేహాలు.. తమవారి కోసం రెప్పవాల్చకుండా వెతుకుతున్న అభాగ్యులు.. సాయం కోసం స్థానికులు ముందుకొచ్చారు. అంతులేని దు:ఖంతో బహనగబజార్ ప్రాంతమంతా మరుభూమిని తలపించింది. ఈ ఘోర రైలు ప్రమాద ఘటన జరిగి 24 గంటలు గడిచినా.. ప్రమాదస్థలిలో విషాదఛాయలు తొలగిపోలేదు.
సిగలింగ్ వ్యవస్థ వైఫల్యంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్‌ను ఢీకొనడం.. ఆ బోగీలు మరో మెయిన్ ట్రాక్‌లోకి ఒరిగిపోవడం.. ఆ తర్వాత వాటిని యశ్వంత్‌పూర్ సూపర్ ఫాస్ట్ రైలు ఢీకొనడం వెంటవెంటనే జరిగాయి. శకలాలు ఇంకా పూర్తిగా తొలగించనందున.. ఒడిశా ఘోరకలిలో ఇప్పటి వరకు 288 మంది మరణించారనీ, మరో 900 మంది గాయపడ్డారని భారతీయ రైల్వే అధికారికంగా ప్రకటించింది.
ప్రమాదస్థలిని, ఆ తర్వాత క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులను ప్రధాని మోడీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, వివిధ రాష్ట్రాల నుంచి వెళ్లిన ఉన్నతస్థాయి బృందాలు సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై రైల్వేశాఖ, ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులు ప్రధానికి వివరించారు. అనంతరం ఆయన ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైనవారు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.