కొత్త పార్లమెంటుకు సంబంధించిన ప్రతీ అంశంలో బీజేపీకి ప్రతిపక్షాలకు తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. పార్లమెంటు భవనం రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించడం.. ప్రారంభోత్సవానికి అసలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు ఆహ్వానం అందించకపోవడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రధాని, బీజేపీ తీరును నిరసిస్తూ.. 20 ప్రతిపక్ష పార్టీలు.. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదంటూ ఉమ్మడి ప్రకటన చేశాయి.
మరోవైపు.. పార్లమెంటు ఆవరణలో స్పీకర్ కుర్చీ వద్ద 8 వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి రాజదండాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. దీనిపై తాజాగా దుమారం చెలరేగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బ్రిటీష్ చివరి వైశ్రాయ్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్.. అధికార బదిలీకి గుర్తుగా తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకు అందించినట్లు బీజేపీ వెల్లడించింది. అయితే అందుకు సరైన ఆధారాలు లేవని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.