దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టు అయిన వైసీపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి కి మరోసారి ఢిల్లీ హైకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. ఓ వైపు భార్య కు ఆరోగ్యం బాగోలేని వేళ.. ఆమెకు వరుస పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంలో తన భార్య వెంట ఉండేందుకు అనుమతించాల్సిందిగా మాగుంట కోరినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాగుంట రాఘవ ను ఈడీ అధికారులు అరెస్టు చేయటం తెలిసిందే. సౌత్ గ్రూప్ తరఫున చెల్లించిన రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో రాఘవ రెడ్డి పాత్ర ఉందని.. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన నిందితులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ ఆరోపించింది.
ఈ కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో.. తదుపరి విచారణను రాఘవరెడ్డిని కస్టడీకి కోరాగా అందుకు కోర్టు ఓకే చెప్పింది. మరోవైపు రాఘవ రెడ్డి సతీమణి ఆరోగ్యం ఏ మాత్రం సరిగా లేకపోవటంతో.. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు. దీని పై విచారణ చేపట్టిన కోర్టు.. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నో చెప్పేసింది. ఈ స్కాంలో ముడుపుల ను హవాలా మార్గంలో చెల్లింపులు జరిపారని కోర్టు పేర్కొంది.
ఇప్పటికే ఈ కేసు కు సంబంధించిన వ్యవహరాల్లో 30 మంది సాక్ష్యుల వాంగ్మూలాన్నినమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇండో స్పిరిట్ కంపెనీలో రాఘవ రెడ్డి కీ భాగస్వామ్యం ఉందని.. దీని నుంచే ఆయనకు వాటా వెళుతుందన్నది ఈడీ ఆరోపణ. మద్యం విధానంలో ప్రయోజనం పొందేందు కు ముడుపులు ఇచ్చారని.. ఈ ముడుపులను హవాలా మార్గంలో చెల్లింపులు జరిపినట్లుగా కోర్టుకు వివరించారు.