చైనా నుంచి మరో ముప్పు పొంచి ఉందా.. ?
జూన్ నాటికి చైనాలో వారానికి 6.5 కోట్ల కేసులు నమోదు
చైనా నుంచి మరో ముప్పు పొంచి ఉందా.. ఈ సందేహం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలవరపెడుతోంది. కరోనా వైరస్ తో ఇప్పటికే అనూహ్య పరిణామాలను చవిచూసిన జనం.. ఇప్పుడు మరోసారి కరోనా మరో వేవ్ పై భయాందోళనలకు గురవుతోంది. దీంతో చైనా ఇప్పట్నుంచే వ్యాక్సిన్ల కోసం పరుగులు పెడుతోంది.
చైనాలో మరోసారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే అక్కడి పరిస్థితులపై అంతర్జాతీయ మీడియాలో విస్తృత కథనాలు వెలువడుతున్నాయి. మే నెల చివరి నాటికి చైనాలో వారానికి 4 కోట్ల కేసులు నమోదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తీవ్రత జూన్‌లో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని హెచ్చరించారు.
ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ కారణంగా ఏప్రిల్ నుంచి చైనాలో కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. మే నెల ఆఖరు నాటికి చైనాలో వారానికి 4 కోట్ల కేసులు నమోదవుతాయని నిపుణులు అంచనా చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇక అది మరింత తీవ్రంగా మారి జూన్ నెలాఖరు నాటికి వారానికి 6.5 కోట్ల మందికి కరోనా సోకుతుందని పేర్కొన్నాయి. చైనాలో కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు తీసుకువచ్చిన జీరో కొవిడ్ విధానాన్ని.. 2022 డిసెంబరులో జిన్‌పింగ్ సర్కార్ తొలగించింది. దాని తర్వాత అడపాదడపా కొత్త వేవ్‌లు వచ్చినా.. ఈ స్థాయిలో ఉద్ధృతి కనిపించడం ఇప్పుడేనని నిపుణులు చెబుతున్నారు.
కరోనా కొత్త వేవ్ ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం చైనా కొత్త వేరియంట్ల కోసం టీకాలను సిద్ధం చేస్తోంది. చైనాలోని మూడు కొత్త వేరియంట్లను (ఎక్స్ బీబీ 1.9.1, ఎక్స్ బీబీ 1.5, ఎక్స్ బీబీ 1.16) అడ్డుకునే టీకాలకు ప్రాథమిక అనుమతి ఇచ్చామని చైనా అంటువ్యాధుల నిపుణులు చెబుతున్నారు. మరో మూడు, 4 టీకాలకు కూడా త్వరలోనే అనుమతులు రానున్నట్టు వెల్లడించారు.