AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐటీఐఆర్‌పై చర్చకు సిద్ధమా?

మంత్రి కేటీఆర్‌కు రఘునందనరావు సవాల్‌
కేంద్రాన్ని కావాలనే బద్నాం చేస్తున్న కేసీఆర్‌ సర్కార్‌

హైదరాబాద్‌: ఐటీఐఆర్‌పై మంత్రి కేటీఆర్‌ చర్చకు సిద్ధమా అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సవాల్‌ విసిరారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కేంద్రం, ప్రధాని మోదీపై ప్లాన్‌ ప్రకారమే బీఆర్‌ఎస్‌ పార్టీ దాడి చేస్తోందని మండిపడ్డారు. ఐటీఐఆర్‌ పై మంత్రి కేటీఆర్‌ చర్చకు రావాలన్నారు. ఐటీఐఆర్‌పై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఐటీఐఆర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని అన్నారు. ఐటీఐఆర్‌కు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ నిధులను కేంద్రం మంజూరు చేసిందని రఘునందనరావు పేర్కొన్నారు.

డీపీఆర్‌ సమర్పించకుంటే కేంద్రం నిధులు ఎలా కేటాయిస్తోందని రఘునందనరావు ప్రశ్నించారు. తెలంగాణలో హైవేలు, రైల్వేలు అభివృద్ధికి కేంద్రం కంకణం కట్టుకుందని, ఐటీఐఆర్‌పై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కావాలనే బద్నాం చేస్తోందన్నారు. ఐటీఐఆర్‌ అంటే భవనాలు కాదు.. పెట్టుబడులు ఆకర్షించటానికి రోడ్లు, మెట్రో రైలును అభివృద్ధి చేయటమని అన్నారు. ఐటీఐఆర్‌ను రెండు విడతల్లో అభివృద్ధి చేయాలని ఆప్పటి భారత ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఇమ్లీబన్‌ బస్టాప్‌ నుంచి ఫలకనూమ మెట్రో రాకపోవటానికి ఎంఐఎం, బీఆర్‌ఎస్‌లే కారణమని ఆరోపించారు. ఐటీఐఆర్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఒక్క పనికూడా చేయడంలేదని ఎమ్మెల్యే రఘునందనరావు తీవ్రస్థాయిలో విమర్శించారు.

ANN TOP 10