– ఫైనల్లో చోటు కోసం అమీతుమీ
– చెపాక్‌లో ఫేవరేట్‌గా ధోనీసేన
– రాత్రి 7.30 నుంచి
– క్వాలిఫయర్ 1 పోరు
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ క్వాలిఫయర్1 పోరుకు సిద్ధమయ్యాయి. ఐపీఎల్16 ఫైనల్లో తొలి అడుగు వేసేందుకు నేడు చెపాక్‌లో స్పిన్ సవాల్‌కు సై అంటున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో ఫైనల్లోకి చేరుకునేందుకు ఎదురుచూస్తుండగా.. నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ రికార్డు స్థాయిలో మళ్లీ తుది పోరులో తలపడేందుకు ఉవ్విళ్లూరుతోంది. గ్రూప్ దశ మ్యాచుల్లో టాప్-2 నిలిచిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ అంతిమ సమరానికి చేరుకునేందుకు రెండు అవకాశాలు దక్కించుకున్నాయి. తొలి చాన్స్‌లోనే ఫైనల్లోకి అడుగుపెట్టే జట్టు ఏదో నేడు చెపాక్‌లో తేలనుంది.
నిలకడ, బాధ్యతల్లో స్పష్టత, నిరూపించుకునే అవకాశం ఇవ్వటం, సహజశైలిలో రాణించేందుకు స్వేచ్ఛ కల్పించటం.. చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ విజయ మంత్ర ఇదే. సూపర్‌కింగ్స్, టైటాన్స్ మైదానంలో అనుసరించే వ్యూహలు పూర్తి భిన్నం. కానీ జట్టును విజయ పంథాలో నడిపించేందుకు అనుసరించే మార్గాలు మాత్రం ఒకటే కావటం యాదృచ్చికం ఏమీ కాదు. ఎం.ఎస్ ధోని నాయకత్వ లక్షణాల నుంచి ప్రేరణ పొందిన హార్దిక్ పాండ్య.. మహి తరహాలోనే కూల్‌గా గుజరాత్ టైటాన్స్‌ను నడిపిస్తున్నాడు.
అరంగేట్ర సీజన్లోనే చాంపియన్‌గా నిలిచిన టైటాన్స్.. రెండో సీజన్లో మళ్లీ టైటిల్ నిలుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఐపీఎల్ ఆరంభం నుంచీ అత్యంత నిలకడగా సూపర్‌కింగ్స్‌కు సారథ్యం వహిస్తూ ఏకంగా 12వ సారి చెన్నైకి ప్లే ఆఫ్స్‌కు చేర్చిన నాయకుడు ఎం.ఎస్ ధోని. ఇప్పుడు క్వాలిఫయర్ 1 పోరులో ధోని, హార్దిక్ నాయకులుగా మరోమారు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో టైటాన్స్, సూపర్‌కింగ్స్ మ్యాచ్‌లో పాండ్యసేన పైచేయి సాధించగా.. ఇప్పుడు సీజన్ 71వ మ్యాచ్‌లో చెన్నై లెక్క సరిచేస్తుందేమో చూడాలి. చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్ 1 పోరు నేడు చెపాక్‌లో రాత్రి 7.30 గంటలకు ఆరంభం. స్టార్‌స్పోర్ట్స్, జియో సినిమాలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.