రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి…
ఆ అన్నదమ్ములది నిరుపేద కుటుంబం. తండ్రి సంతలో బట్టలు అమ్ముతూ.. తల్లి కూలీ పనులు చేస్తూ వారికి ఉన్నత చదువులు చెప్పించారు. తల్లదండ్రుల కష్టాల్ని, నమ్మకాన్ని ఒమ్ము చేయని ఆ ఇద్దరు బ్రదర్స్.. కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సాధించారు. ఇక లైఫ్ సెటిల్డ్. తమకోసం అన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులను ఇక నుంచి బాగా చూసుకోవాలని అనుకున్నారు. కుమారులుగా వారికి ఏ కష్టం రాకుండా చూడాలన్నారు. కానీ తామొకటి తలిస్తే.. విధి ఒకటి తలిచిందన్నట్లు వారి ఆశలు కుప్పకాలాయి. కన్నవారి కళ్లల్లో ఆనందానికి బదులు విషాదాన్ని నింపాయి. ఇద్దరిని రోడ్డు ప్రమాదం ఒకేసారి కబళించింది.
ప్పలపల్లి మనోహర్ సంతల్లో వస్త్రాలు విక్రయిస్తూ, తల్లి శారద కూలీ పని చేస్తూ తన ఇద్దరు కుమారులను చదివించారు. వీరిలో పెద్ద కుమారుడు ఇప్పలపల్లి శివరామకృష్ణ (25) ఇటీవలే రైల్వే శాఖలో టీసీగా కొలువు సంపాదించి సికింద్రాబాద్‌లోని మౌలాలిలో శిక్షణ పొందుతున్నారు. చిన్న కుమారుడు ఇప్పలపల్లి హరికృష్ణ (23) బీసీఎస్ పూర్తి చేసి హైదరాబాద్ ఘట్‌కేసర్‌లోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించారు. చిన్న కుమారుడు నాలుగు రోజుల కిందట, పెద్ద కుమారుడు ఆదివారం ఇంటికి వచ్చారు. శివరామకృష్ణకు తపాలా శాఖలోనూ ఉద్యోగం రాగా, ఏ ఉద్యోగం చేయాలనే విషయమై చర్చించుకున్నారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన ఇద్దరు అన్నదమ్ములు తిరిగి విధులకు వెళ్లేందుకు సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.
హసన్‌పర్తి మండలం అనంతసాగర్ శివారుకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం మరోదాన్ని ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు అన్నదమ్ముళ్లు శివరామకృష్ణ, హరికృష్ణ ఎగిరి రోడ్డు పక్కన పడ్డారు. అక్కడికక్కడే మృతి చెందారు. ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించగా ఎల్కతుర్తి సీఐ ప్రవీణ్‌కుమార్, పోలీసు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు ఆ రోడ్డులో ఉండే సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
అమ్మా.. నాన్నకు వెళ్లొస్తామని చెప్పి బయలుదేరిన కుమారులు కొద్దిసేపటికే మృతి చెందారని తెలుసుకుని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.. వెళ్లొస్తామని చెప్పి ఎటు వెళ్లిపోయారు బిడ్డా.. అంటూ ఆ తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.. ప్రమాదం విషయం తెలిసి తల్లిదండ్రులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. మరణోత్తర పరీక్షల అనంతరం మృతదేహాలను గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలను నిర్వహించారు. మృతదేహాలను చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగే అన్నదమ్ములు ఒకేసారి మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.