మహారాష్ట్రకు చెందిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేస్తున్న హర్షల్ కుమార్(Harshal Kumar) అనే వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. 13 వేల జీతం తీసుకునే ఆ వ్యక్తి.. అక్రమ రీతిలో 21 కోట్లు సంపాదించాడు. ఆ డబ్బుతో అతను లగ్జరీ కార్లు కొన్నాడు. ఇంకా తన గర్ల్‌ఫ్రెండ్‌కు 4బీహెచ్‌కే ఫ్లాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. ఛత్రపతి సంభాజినగర్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కాంట్రాక్టు స్టాఫ్‌గా చేస్తున్న హర్షల్ కుమార్ అక్రమార్జనకు తెగించాడు. అతనితో పాటు ఉద్యోగం చేసే యశోదా శెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె భర్త బీకే జీవన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
23 ఏళ్ల హర్షల్ చాలా చాకచక్యంగా డబ్బును కాజేశాడు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు చెందిన ఓ పాత లెటర్‌హెడ్ ద్వారా బ్యాంకుకు ఈమెయిల్ చేశాడు. అకౌంట్‌తో లింకున్న ఈమెయిల్ అడ్రాసును మార్చాలని కోరాడు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ అకౌంట్‌తో సరిపోయే రీతిలో ఉన్న కొత్త ఈమెయిల్ అకౌంట్ ఓపెన్ చేశాడు. కేవలం ఒక్క అక్షరం తేడా ఆ అకౌంట్ తెరిచాడు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్యాంక్ అకౌంట్‌తో లింకున్న ఆ అడ్రస్‌తో .. లావాదేవీలకు అవసరమైన ఓటీపీలను హర్షల్ ఓపెన్ చేసేవాడు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని యాక్టివేట్ చేశాడు. జూలై ఒకటి నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు బ్యాంకు ఖాతా నుంచి 21.6 కోట్లు కాజేసి వాటిని 13 బ్యాంకు అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశాడు.
ఆ డబ్బుతో అతను 1.2 కోట్లు ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కొన్నాడు. 1.3 కోట్లతో మరో ఎస్‌యూవీ తీసుకున్నాడు. 32 లక్షల ఖరీదైన బీఎండబ్ల్యూ బైక్ కూడా కొన్నాడు. ఛత్రపతి సంభాజినగర్ విమానాశ్రయం వద్ద ఉన్న విలాసవంతమైన 4 బీహెచ్‌కే ఫ్లాట్‌ను గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ కేసులో మరికొంత మంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డబ్బు లావాదేవీలకు చెందిన ఇతర అకౌంట్లను పరిశీలిస్తున్నారు. లగ్జరీ కార్లను ఇప్పటికే సీజ్ చేశారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ అకౌంట్లో అక్రమాలు జరుగుతున్నట్లు ఓ అధికారి గుర్తించి ఫిర్యాదు ఇవ్వడంతో హర్షల్ బాగోతం బయటకు వచ్చింది.
ప్రధాన నిందితుడు హర్షల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మరో ఇద్దర్ని ఇప్పటికే అరెస్టు చేశారు. కొన్ని బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.